అవకాశాల గనిగా భారత్… త్వరలోనే రివర్స్ మైగ్రేషన్-ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సులో..
అమరావతి: అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా భారతీయులు కనిపిస్తారని ఆయన స్పష్టం చేశారు. టెక్నాలజీ, టెలి కమ్యూనికేషన్స్ లాంటి సంస్కరణల్ని మొదటగా అందిపుచ్చుకోవటం వల్లే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం వివరించారు. ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో సాంకేతికత-సుపరిపాలన-భవిష్యత్తు అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు. సహకార సమాఖ్య దేశంగా కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని సీఎం వివరించారు.
త్వరలో రివర్స్ మైగ్రేషన్:- ఐటీలో భారతీయుల పరిజ్ఞానం అందరికీ తెలిసిందేనని .. డిప్లొమసి, ఫ్లెక్సిబిలిటీ విషయాల్లో వారికి మంచి పేరు ఉందని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు భారత్ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. నైపుణ్యం, వనరులు ఉన్న చోటుకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మేర జీసీసీలు భారత్ కు వచ్చాయన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా భారత్ దూసుకెళ్తోందని తెలిపారు. భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ ను భారత్ ఎగుమతి చేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్:- విభిన్నంగా ఆలోచన చేసే వారి కోసం అమరావతిలో క్రియేటివ్ సిటీ నిర్మిస్తున్నామని.. డ్రోన్ సిటీ, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ సిటీలను కూడా నిర్మిస్తున్నామని అన్నారు. సమీప భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు రానున్నాయని.. గతంలో ఊహగానే ఉన్న డ్రోన్ అంబులెన్సులు కూడా రియాలిటీలోకి వచ్చేశాయన్నారు. ఏఐ డేటా సెంటర్లతో ఏపీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ డెస్టినేషన్ గా ఏపీ తయారవుతుందని అన్నారు. మెరుగైన సదుపాయాలతో వ్యాపార అనుకూల ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దామని.. పెట్టుబడులతో వస్తే జాప్యం లేకుండా అనుమతులు ఇస్తున్నట్టు పేర్కోన్నారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సహా 110 దేశాల నుంచి 2700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, నిఫుణులు, వ్యూహకర్తలు హాజరయ్యారు. 2016 నుంచి జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ సదస్సుకు తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిర్వాహకులు ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఈ రైసినా డైలాగ్ కు హాజరై తన అభిప్రాయాలను వివరించారు.

