దేశంలో భారీ పేలుళ్లులకు కుట్ర-నాలుగురు ఉగ్రవాదులు అరెస్ట్
రైల్వేస్టేషన్ వద్ద పేలుడుకు కుట్ర..
ప్రముఖుల ఇళ్లు,సంస్థల వద్ద రెక్కి..
అమరావతి: రైల్వే స్టేషన్లతో సహా ముఖ్యమైన ప్రదేశాలలో పేలుళ్లకు పాల్పడాలని కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలపై, ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) పోలీసులు లక్నోలో ఒక ISI అదేశాలతో పనిచేస్తున్న ముఠాను గుర్తించి, నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నిందితులకు పాక్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. నలుగురు నిందితులను సాకిబ్ అలియాస్ డెవిల్, వికాస్ గెహ్లావత్ అలియాస్ రౌనక్, లోకేశ్ అలియాస్ పాప్లా పండిట్ అలియాస్ బాబు అలియాస్ సంజు, అర్బాబ్‌గా గుర్తించారు. పాకిస్థాన్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు వీరంతా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రైల్వేస్టేషన్ వద్ద పేలుడుకు కుట్ర:- వీరంతా దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులు టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పాకిస్థాన్ తీవ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు విచారణలో ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు మీరట్‌కు చెందిన సాకిబ్ అలియాస్ డెవిల్ అని తెలిపారు. మిగిలిన ముగ్గురితో కలిసి దేశంలో అతను పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 2న లక్నో రైల్వేస్టేషన్ వద్ద పేలుడుకు కుట్ర పన్నుతుండగా పక్కా సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లి వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ప్రముఖుల ఇళ్లు,సంస్థల వద్ద రెక్కీ:- వీరిపై క్రిమినల్ యాక్టు BNS, UAPA చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి పేలుడు పదార్థాలు, 7 స్మార్ట్ ఫోన్లు, 24 కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు..నిందితులు కొన్ని ప్రదేశాల్లో చిన్నపాటి పేలుళ్లకు పాల్పడ్డారని, దాన్ని వీడియో తీసి ఉగ్రసంస్థలకు పంపారని పోలీసులు తెలిపారు. దాని ద్వారా ఉగ్రసంస్థల నుంచి నిధులు సేకరించారని పేర్కొన్నారు. వీరంతా సోషల్ మీడియాను ఉపయోగించి యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారన్నారు.రైల్వే సిగ్నల్స్, గ్యాస్ సిలిండర్ల ట్రక్కులు, ప్రభుత్వ కీలక ఆస్తులే లక్ష్యంగా దాడికి ప్లాన్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే వీరంతా రాజకీయ ప్రముఖుల ఇళ్లు, ప్రముఖ సంస్థల వద్ద రెక్కీ నిర్వహించారని, ఆ సమాచారాన్ని పాకిస్థానీ హ్యాండ్లర్లకు పంపారని తెలిపారు. ఘజియాబాద్, అలీగఢ్, లక్నోతోపాటు ప్రముఖ ప్రదేశాల్లో వీరంతా సర్వే చేశారని పోలీసులు పేర్కొన్నారు.

