ఫిబ్రవరి 8న కృష్ణానదిలో ‘కృష్ణాతీరం- కవితాహారం’ కవి సమ్మేళనం-కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
నేటి సాహిత్యాన్ని ముందు తరాలకు..
అమరావతి: తెలుగు సాహిత్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు, ముఖ్యంగా సరికొత్తగా రూపాంతరం చెందిన, చెందుతున్న నేటి నైరూప్య కవిత్వాన్ని (యాబ్ స్ట్రాక్ పొయిట్రీని) భద్రపరిచి, ముందుతరాలకు అందించేందుకు రికార్డు చేయాల్సిన అవసరం వుందని, లేకుంటే అది కాలగర్భంలో కలిసే ప్రమాదముందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఫిబ్రవరి 8న ఆదివారం కృష్ణానదిలో బోధిసిరి పడవపై నిర్వహిస్తున్న ‘కృష్ణాతీరం-కవితాహారం’ కవి సమ్మేళనం వినూత్న కార్యక్రమ గోడపత్రికను బుధవారం కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం డా. లక్ష్మీశ మాట్లాడుతూ – ప్రవహించే కృష్ణానదీ తరంగాలపై ఉరకలెత్తే కవితా ప్రవాహంగా, అమరావతి ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు ఈతరం కవులు సమర్పించే కవితాహారతిగా నిర్వాహకులు ఈ కవి సమ్మేళనాన్ని రూపొందిస్తున్నారని ఆయన అన్నారు. మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ అధ్యక్షుడు కలిమిశ్రీ మాట్లాడుతూ- కవిత్వాన్ని శ్వాసగా పీలుస్తూ, సమాజం కోసం కవిత్వమై జీవిస్తున్న లబ్ద ప్రతిష్టులైన నాటితరం కవులతోపాటు నేటితరం కవుల నుండి ఎంపిక చేసుకున్న 50 మంది కవులతో ఈ వినూత్న కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో కవులు చదివే కవిత్వాన్ని వీడియో డాక్యుమెంటేషన్ చేసి ముందుతరాలకు భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని కలిమిశ్రీ అన్నారు. కార్యక్రమంలో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ గౌరవ సలహాదారులు యేమినేని వెంకట రమణ, సభ్యులు వై.డి. ఆనంద్, విద్యావేత్త డా. వి. శ్యామ్, టెన్నిస్ కోచ్ సింగంశెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

