జిల్లాస్థాయిలోనే నెంబర్ వన్‌గా ఆత్మకూరు క్రీడా వికాస కేంద్రం-మంత్రి ఆనం
నేను V,R.కళాశాలలో బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిని..
నెల్లూరు: జిల్లాస్థాయిలోనే నెంబర్ వన్‌గా, అత్యాధునిక సౌకర్యాలతో 20 ఎకరాల్లో ఆత్మకూరు క్రీడా వికాస కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ఆత్మకూరులోని గురుకుల పాఠశాల సమీపంలో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్రీడా వికాస కేంద్రానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువతకు, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చడమే లక్ష్యంగా క్రీడా వికాస కేంద్రాలు, నగర వనాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.2013లో తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆత్మకూరులో రూ.2 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని మంజూరు చేసి కొంతవరకు పనులు చేపట్టామని, అనంతరం వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వ హయాంలో రూ.1.80 కోట్లతో మళ్లీ పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.
నేను V,R.కళాశాలలో బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిని:- 1984లో తాను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం, మెడికల్ కళాశాలలకు ప్రహరీ గోడలు నిర్మించి భూములకు రక్షణ కల్పించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదే విధంగా క్రీడా వికాస కేంద్రానికి కేటాయించిన భూములను కూడా భద్రపరచి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తాను V,R.కళాశాలలో మంచి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడినని, ఆటలంటే తనకు ఎంతో మక్కువ ఉందని విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. కష్టపడి పనిచేస్తే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని విద్యార్థులకు మంత్రి ఉద్భోధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పాండురంగారావు, డిప్యూటీ డీఈఓ జానకిరామ్, ఆర్డీవో పావని, కమిషనర్ గంగాప్రసాద్, తహసీల్దార్ పద్మజ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహకులు రమణయ్య, పీడీ సరిత, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

