ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో 10 మంది సైనికులు మృతి
అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో 10 మంది సైనికులు మరణించగా, మరో 9 మంది గాయపడ్డారు. బందేర్వా-చంబా హైవేపై ఉన్న ఖన్ని టాప్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ వాహనంలో దాదాపు 17 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ఆర్మీ వాహనం హై ఆల్టిట్యూడ్ పోస్టు వద్దకు వెళ్తున్న సమయంలో డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో సుమారు 200 అడుగుల లోతులో ఆ వెహికిల్ పడిపోయింది.సమాచారం అందుకున్న ఆర్మీ,,పోలీసులు బృందదలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన ఉధంపూర్ మిలటరీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గవర్నర్ మనోజ్ సిన్హా:- ఈ ప్రమాద సంఘటలనను జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.‘దోడాలో జరిగిన దురదృష్టకర ఘటనలో 10 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. మన సైనికుల అత్యుత్తమ సేవ, త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని సిన్హా పోస్ట్ చేశారు. ఈ సంఘటనలో మరి కొంతమంది సైనికులను ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు. వీరందరికీ ఉత్తమ మెరుగైన చికిత్స అందించాలంటూ అధికారులను ఆదేశించారు.

