హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు
హెల్మెట్ తప్పక ధరించాలి..
తిరుపతి, డిసెంబర్ 15: హెల్మెట్ ధరించిన కారణంగా రోడ్డు ప్రమాదాల నుండి వాహనదారులు తమ ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని, ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి పట్టణంలోని జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుండి సుమారు 700 మందితో ఏర్పాటు చేసిన నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీని జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడితో కలసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
జిల్లాలో ప్రతి సంవత్సరం500 మంది:- ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు 500 మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని, వీరిలో చాలా వరకు హెల్మెట్ లేకపోవడంతో తలకు బలమైన గాయాలై మరణించారన్నారు. హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే వీరు ప్రాణాలతో ఉండే అవకాశం ఉండేదన్నారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా నో హెల్మెట్ – నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా నేటి నుండి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లో హెల్మెట్ లేనిదే ద్విచక్ర వాహనాలకు ఇవ్వడం ఉండదని తెలిపారు.
జరిమానా విధించడం మా ధ్యేయం కాదు:- జిల్లా ఎస్ పి మాట్లాడుతూ హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం మరణిస్తున్నారని, హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకుని తమ కుటుంబాలతో సురక్షితంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించడం తమ ధ్యేయం కాదని, ప్రజల భద్రత తమ భాధ్యత అని అన్నారు. ద్విచక్ర వాహనాదారులు చిన్న ఆక్సిడెంట్ ల కూడా తలకు బలమైన గాయాల కారణంగా మరణిస్తున్నారన్నారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ర్యాలీలో ASPలు రవి మనోహరాచారి,డి శ్రీనివాసరావు, నాగభూషణం, DSPలు,CIలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

