AP&TGNATIONAL

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి స్వామినాథన్,అభిశంసన పిటిషన్‌ దారుణం-పవన్ కళ్యాణ్

సనాతనధర్మంపై సెక్యులరిజం పేరుతో దాడులు..

అమరావతి: హిందూ ఆలయానికి చెందిన భూమిలో దీపం వెలిగించడం, సంప్రదాయాలను పాటించడం భక్తుల హక్కు అని తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జి ఆర్ స్వామినాథన్ పై డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు 120 మందికిపైగా అభిశంసన పిటిషన్‌కు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మండిపడ్డారు.

హిందూ విశ్వాసాలకు:- హిందూ విశ్వాసాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని, న్యాయవ్యవస్థను భయపెట్టేలా, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ, సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయనని వెల్లడించారు. ఇండియా కూటమి ఎంపీలు 120 మందికిపైగా న్యాయమూర్తి అభిశంసనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపులేనని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు.

శబరిమల ఆలయంపై తీర్పు ఇచ్చిన జడ్జీపై:- శబరిమల ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మార్చినపుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెలువడ్డాయని పవన్‌ కల్యాణ్‌ గుర్తుచేశారు. ఆ తీర్పు వల్ల సామాజిక అశాంతి చెలరేగినా.. అప్పట్లో ఏ న్యాయమూర్తిపైనా అభిశంసన ప్రతిపాదన తీసుకురాలేదని తెలిపారు. కేవలం తీర్పుపై న్యాయపరమైన పునఃపరిశీలన మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఓ మాజీ సీజేఐ హిందూ భక్తుల విశ్వాసాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదే ఆ మాజీ సీజేఐపై న్యాయవాది విమర్శలు చేస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని తెలిపారు.

దీపం వెలిగించడం:- ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుని రాజకీయ పార్టీలు,, ఇప్పుడు హిందూ ఆలయానికి చెందిన భూమిలో దీపం వెలిగించడం, సంప్రదాయాలను పాటించడం భక్తుల హక్కు అని తీర్పు ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.

సనాతన ధర్మ రక్షణ బోర్డు:- రాజకీయ పక్షపాతం లేకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలంటే సంస్థాగత మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయ వ్యవహారాలను భక్తులే స్వయంగా నిర్వహించుకునేలా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు అవసరమని స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా, మతపరమైన వ్యవహారాలు శాంతియుతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *