30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారంపై నిషేధం అమల్లోకి- జిల్లా కలెక్టర్
పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు..
స్థానికేతరులు పట్టణ ప్రాంతాలను విడిచివెళ్లాలి..
నెల్లూరు: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నవంబర్ 1వ తేదీన జరగనున్న నేపథ్యంలో, పోలింగ్ ముగింపు సమయానికి ముందు 48 గంటల వ్యవధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి:- నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనున్నందున, అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారంపై నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం చేస్తున్న ప్రకటనలకు సంబంధించిన లింకులను ప్రైవేట్‌గా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఇతర వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయేలా:- ఈ నేపథ్యంలో ప్రచార గడువు ముగిసిన వెంటనే సంబంధిత పట్టణ స్థానిక సంస్థ పరిధిలో ఓటర్లు కాని రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, ఇతర వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయేలా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు.
లాడ్జీలు, అతిథి గృహాల్లో:- ఈ ఆదేశాల అమలులో భాగంగా కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జీలు, అతిథి గృహాల్లో బస చేస్తున్న వారి వివరాలను పోలీసులు పరిశీలించాలన్నారు. కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా వ్యక్తుల గుర్తింపు పత్రాలను పరిశీలించి, వారు సంబంధిత పట్టణ స్థానిక సంస్థ పరిధిలో ఓటర్లా కాదా అని నిర్ధారించాలన్నారు.

