AP&TG

తుఫాను బాధిత మత్స్యకారులు, చేనేత కార్మికులకు త్వరగా పరిహారం అందించాలి-పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి

ముఖ్యమంత్రి సహాయక చర్యలు ప్రశంసనీయం..

మంత్రివర్గ సమావేశంలో..

ఉప్పాడ తీరంలో 157 బోట్లు దెబ్బతిన్నాయి..

చేనేత కార్మికుల ఉపాధికి విఘాతం..

అమరావతి: అర్నబ్ తుఫాను కారణంగా నష్టపోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులను ఆదుకొని, వారికి వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వీడియో కాన్పరేన్స్ విధానంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని తుఫాను నష్టాలు, సహాయక చర్యలపై పలు అంశాలను ప్రస్తావించారు.

ఉప్పాడ తీరంలో 157 బోట్లు దెబ్బతిన్నాయి:- అర్నబ్ తుఫాను ఉప్పాడ తీర ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలల ఉద్ధృతికి కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లు దెబ్బతిన్నాయని వివరించారు. ఉప్పాడ తీరంలో 40 బోట్లు, కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు దెబ్బతిన్నట్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. నష్టపోయిన బోట్లకు తగిన పరిహారం త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో బోట్లు, వలలు, ఇతర వేట సామగ్రిని కోల్పోయిన మత్స్యకారులందరికీ నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

చేనేత కార్మికుల ఉపాధికి విఘాతం:- అర్నబ్ తుఫాను కారణంగా ఉప్పాడ ప్రాంతంలోని చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా పవన్ కళ్యాణ్ మంత్రివర్గం దృష్టికి తీసుకొచ్చారు. భారీ వర్షాల వల్ల మగ్గాల్లోకి నీరు చేరడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం వంటి సమస్యలతో చేనేత కార్మికుల జీవనోపాధికి ఆటంకం ఏర్పడిందని వివరించారు. చేనేత రంగానికి జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, బాధితులకు తుఫాను పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి సహాయక చర్యలు ప్రశంసనీయం:- విపత్తు నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు ప్రశంసనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తుఫాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించిన తీరును అభినందించారు.

ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను సమర్థంగా సమన్వయం చేశారని తెలిపారు. తుఫాను సహాయక చర్యల్లో భాగస్వాములైన మంత్రివర్గ సహచరులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కృషిని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *