భోగాపురం విమానాశ్రయ ప్రారంభానికి ఉత్తరాంధ్ర సిద్ధం-మంత్రులు నారాయణ, గొట్టిపాటి
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును..
మూడు లక్షల మందితో..
విజయనగరంలో అభివృద్ధి పనులకు నిధులు..
అమరావతి: ఆగష్టు 1వ తేదిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విజయనగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం విజయవంతం కోసం మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ స్థానిక నాయకులను సమన్వయం చేస్తున్నామని చెప్పారు. సుమారు మూడు లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున రవాణా, భద్రత, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించామని, VMRDA నిధులతో Rs. 21 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. అదనంగా నగర అభివృద్ధి కోసం మరో Rs. 20 కోట్ల నిధులు మంజూరు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలోనే భోగాపురం విమానాశ్రయానికి పునాది పడిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు నిర్లక్ష్యానికి గురైనప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసిందన్నారు.

