మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
అమరావతి: అజిత్ పవార్ మూడు రోజుల క్రిందట విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయన స్థానంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత, రాజ్యసభ ఎంపీ, అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని లోక్‌భవన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మహాయుతి మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేతలు శరద్ పవార్, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రాష్ట్రంలో ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం పగ్గాలను సునేత్ర చేపట్టారు.

