అస్సాంలో లవ్ జిహాద్,ల్యాండ్ జిహాద్’కు చరమగీతం-బీజెపీ మేనిఫెస్టో
అమరావతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పార్టీ మేనిఫెస్టోను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపు ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమలు చేస్తామని, ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’కు చరమగీతం పాడేందుకు సమర్థవంతమైన చట్టాన్ని తీసుకువస్తాయని స్పష్టం చేసింది. 31 వాగ్దానాలతో కూడిన బీజేపీ ‘సంకల్ప్ పత్ర’ను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు విడుదల చేశారు. ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) అమలు చేయడం ద్వారా అస్సాం నాగరికత, వారసత్వం, ప్రజల హక్కులను పరిరక్షిస్తామని, ఆరో షెడ్యూల్, ఎస్టీ ప్రాంతాలు మినహా అంతటా యూసీసీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ వాగ్దానం చేసింది. ల్యాండ్, హెరిటేజ్, స్థానికుల హక్కులను కాపాడేందుకు ఇమిగ్రెంట్స్ యాక్ట్-1950ను అమలు చేస్తామని, అక్రమ వలసదారులు ఆక్రమించుకున్న భూములను గుర్తించి, వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. నిజమైన అస్సాం పౌరులకు భూమి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఇండియాన్ ఈస్ట్రన్ గేట్‌వేగా అస్సాంను తీర్చిదిద్దేందుకు రూ.5 లక్షల కోట్లు వెచ్చిస్తామని, వరదల నుంచి అస్సాంకు విముక్తి కల్పించేందుకు ‘వరద నిరోధక మిషన్’ ప్రారంభించి రూ18,000 కోట్లు వెచ్చిస్తామని వెల్లడించింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక యూనివర్శిటీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం అందిస్తామని, లఖ్‌పతి దీదీ పథకం కింద 40 లక్షల మంది మహిళలకు ప్రోత్సాహకాలు ఇస్తామని, టీ తోటల కార్మికుల వేతనాలను రాబోయే ఐదేళ్లలో రోజుకు రూ.500 చొప్పున పెంచుతామని, ఇళ్లు కట్టించి ఇస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది.

