కలువాయి,రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరుజిల్లాలోనే కొనసాగించాలి ఏకగ్రీవ తీర్మానం
జడ్పీ సర్వసభ్య సమావేశం...
నెల్లూరు: 2026-2027 వార్షిక బడ్జెట్ అంచనాలకు, 2025-2026 సవరించిన బడ్జెట్ అంచనాలకు సభ్యులు ఏకగ్రీవంగా సమ్మతి తెలపడంతో ఆమోదించినట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణ తెలిపారు. శనివారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, సిఇవో శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలు:- జిల్లా పరిషత్ సమావేశంలో కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా సభ్యులు ప్రధానంగా చర్చించారు. తిరుపతిజిల్లాలో కలపడం వల్ల ఎదురయ్యే సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. నెల్లూరుజిల్లాలోనే కొనసాగించే సభ్యుల ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ మేరకు సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయగా, ప్రభుత్వానికి నివేదిక పంపుతామని జడ్పీ చైర్మన్ ఆనం అరుణ తెలిపారు.
జిల్లా ప్రజాపరిషత్ ఆదాయ వ్యయములను పద్దులవారీగా కలుపుకుని 2026-27 సంవత్సరపు బడ్జెట్ అంచనాలలో రూ.61,07,26,000.00లు ఆదాయంగా తీసుకుని, వ్యయముగా రూ.61,06,73,896.00లు చూపించి బడ్జెట్ అంచనాలు రూపొందించారు. రూ.52,104.00 మిగులు బడ్జెట్ అంచనాలను తయారుచేశారు. వీటికి సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే 2025-26 సంవత్సరంలో సవరించిన అంచనాలలో రూ.76,45,62,703.00లు ఆదాయంగా రూ.71,98,30,376.00లు వ్యయముగా చూపించారు. వీటికి సభ్యులు ఆమోదం తెలిపినట్లుగా జడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ తెలిపారు.
విజయదీపిక స్టడిమెటీరియల్ ఆవిష్కచారు. జిల్లాలోని 418 జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న 20500మంది విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందించనున్నారు. ఈ సమావేశంలో కావలి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు డివి కృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ, జడ్పీటీసీలు, ఎంపిపిలు అధికారులు హాజరయ్యారు.

