అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శం- మంత్రి పొంగూరు నారాయణ
నెల్లూరు: సోమవారం నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు పొంగూరు నారాయణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసిజిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసికావడం గొప్ప విషయం అన్నారు. ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పితామహుడు అని కొనియాడారు. ఇంజనీరుగా ముంబైలో విద్యను సానిటరీ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారన్నారు. గాంధీ హితబోధలు, సహచర్యత్వం ఎంతో స్ఫూర్తిగా పొందారన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి అసువులు బాసారని అన్నారు. ఆయన డిసెంబరు 15, 1952వ సంవత్సరంలో పరమపదించారని అన్నారు. జువ్వలదిన్నెను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అదేవిధంగా సిఆర్డిఏ పరిధిలో అమరావతి వద్ద 6.8 ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

