రాపూరు,కలువాయి, సైదాపురం మండలాలను జిల్లాలోనే కొనసాగించాలి-మంత్రి ఆనం
నెల్లూరు: రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి, రెవెన్యూశాఖ మంత్రికి, జిల్లా కలెక్టర్ కి తన తరపున విజ్ఞప్తి నివేదికలను అందజేశానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విభజన నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి నేటితో ఆఖరి రోజు కావడంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. శుక్రవారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి మంత్రి ఆనం మీడియా సమావేశం నిర్వహించారు.
జిల్లాలోనే కొనసాగించాలని:- ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్రకు తమ వినతి పత్రాలు, అభ్యంతరాలను అందజేశారని మంత్రి వివరించారు. తాను రాపూరు, వెంకటగిరి నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు, ఆ ప్రాంతాల ప్రతినిధిగా, మంత్రిగా నెల్లూరు జిల్లా భవిష్యత్ దృష్ట్యా ఈ మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని, అలాగే ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో కలపాలని ముఖ్యమంత్రికి విన్నవించానన్నారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలకు..
నూతనంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, నెల్లూరు ఇన్చార్జి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన రూప్‌కుమార్ యాదవ్‌లను మంత్రి ఆనం సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

