500 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల లక్ష్యంగా ప్రణాళికలు-సీఎం చంద్రబాబు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం…
అమరావతి: గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పతులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేయాలని కోరారు. 10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పూర్వోదయ, సాస్కీ, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఇదే సమయంలో సీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని… చాలా వరకు ప్రాజెక్టులను పెండింగులో పెట్టేసిందని మంత్రులు నిమ్మల, పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు.
ప్రపంచంలో అతిపెద్ద ఉద్యాన క్లస్టర్ గా రాయలసీమ:- ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని మూడేళ్లల్లో 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు విస్తరించేలా ప్రణాళికలు చేపట్టినట్టు మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు తెలిపారు. రాయలసీమ ప్రాంతం ఉద్యాన ఉత్పత్తుల విషయంలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉందని… ప్రపంచంలోనే అతిపెద్ద క్లస్టర్ గా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. దుబాయికి చెందిన డీపీ వరల్డ్ సంస్థ ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి సమావేశంలో వెల్లడించారు.
10 జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల వివరాలు:-
వెలిగొండ ప్రాజెక్ట్,, కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం,,పాలేరు రిజర్వాయర్,,మల్లెమడుగు లిఫ్ట్-రిజర్వాయర్,,శ్రీ బాలాజీ రిజర్వాయర్,,కుప్పం బ్రాంచ్ కెనాల్,, పుంగనూరు బ్రాంచ్ కెనాల్,,మూలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం,,హంద్రీ-నీవా ప్రధాన కాల్వ పనులు,,అట్లూరుపాడు-మెర్లపాక ఎస్ఎస్ఎల్సీ,,నీవా బ్రాంచ్ కెనాల్ పనులు,,జీడిపల్లి-భైరవానితిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ పథకం,, జీడిపల్లి-అప్పర్ పెన్నార్ ఎత్తిపోతలు,,అనంతలో కమ్యూనిటీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్,,మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులు,,పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం,,కడప, కోడూరు వరకు గాలేరు-నగరి సుజల స్రవంతి,,అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్దరణ పనులు,,పశ్చిమ కర్నూలుకు నీళ్లిచ్చేలా వేదవతి-అలగనూరు-గాజులదిన్నె ప్రాజెక్టులు,,ఏడు జిల్లాల్లో 1011 మైనర్ ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి పనులు.

