విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
అమరావతి: విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఫిన్ టెక్ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మధురవాడ హిల్ నెం-2లోని మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి మంది సీటింగ్ కేపాసిటీతో ఈ తాత్కాలిక క్యాంపస్ ను ఏర్పాటుచేశారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ మొదటి దశ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ఫిన్ టెక్ భవనంలో కార్యకలాపాలను కొనసాగించనున్నారు. ఈ కేంద్రం కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించనుంది.
అలాగే విశాఖలో ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన,,మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కు శంకుస్థాపన,,ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ సంస్థకు శంకుస్థాపన,,క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కు శంకుస్థాపన,,నాన్ రెల్ టెక్నాలజీస్ కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు.

