అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్న స్వామి బాబా రాందేవ్
అమరావతి: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ యోగా గురువు స్వామి బాబా రాందేవ్ శుక్రవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మికత కలిగిన రాష్ట్రం:- విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద మీడియాతో మాట్లాడిన స్వామి బాబా రాందేవ్, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి రీత్యా, సంస్కృతి పరంగా ఎంతో ఆధ్యాత్మికత కలిగిన రాష్ట్రంగా అభివర్ణించారు. యోగ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొంటూ “కరో యోగ్ – రహో నిరోగ్” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, తదితరులు స్వామి బాబా రాందేవ్‌కు ఘన స్వాగతం పలికారు.

