ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ-17 మంది సజీవ దహనం
అమరావతి: కర్ణాటకలో గురువారం వేకువజామున 3గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన లారీ డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సు డీజిల్ ట్యాంక్ వద్ద ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదంకు గురైన వారంత బస్సు వెనుక భాగంలో కుర్చున్న వారే అని ప్రాథమిక సమాచారం.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిత్రదుర్గం జిల్లా జవరగుండనహళ్లి శివారులోని సిరా-హిరియూరు మధ్య జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. సీబర్డ్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు, బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తొంది. ప్రమాదంలో గాయపడిన వారిలో 9 మందిని సిరాలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హిరియూరులోని ఆస్పత్రిలో మరో 12 మందికి చికిత్స కోసం చేర్పించడం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

