అరబిందోకు 108 పిపిపి మోడ్లో ఎందుకు కట్టబెట్టారు-మంత్రి సత్యకుమార్
అమరావతి: రాష్ట్రంలో ఒక విజిటింగ్ పోలిటీషియన్ అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నారని,, బలప్రదర్శనలు చేయడం ఆయనకు ఆలవాటుగా మారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మండిపడ్డారు.గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ని కలిసి కోటి సంతకాల సేకరణ అంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ జగన్పై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా విమర్శించారు.
బెదిరించడం జగన్ నైజం:- మెడికల్ కాలేజిలో ఎవరైనా కన్స్ట్రక్షన్కు తీసుకుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకు పంపుతాననడం అత్యంత హేయమైన వ్యాఖ్యలని,, ఈ వ్యాఖ్యలు ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమన్నారు. వైద్య కళాశాలల నిర్మాణం కోసం ముందుకు వస్తున్న సంస్థలను బెదిరించడం సరికాదని వైఎస్ జగన్కు ఆయన హితవు పలికారు. 30 కేసులకుపైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి,, 18 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఇలాంటి అసత్య ప్రచారం చేయడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ఈ తరహా అహంకారపూరిత వ్యాఖ్యల వల్లే మిమ్మల్ని ఎన్నికల్లో ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఏమైనా లోపభూయిష్ట విధానం ఉంటే దాని గురించి మాట్లాడాలంటూ జగన్కు సూచించారు.
108 పిపిపి మోడల్లో ఎందుకు ఇచ్చారు:- పిపిపి మోడల్లో ఇవ్వడం తప్పయితే మరి 108ను ఎలాంటి రూల్స్ పాటించకుండా అరబిందోకు పిపిపి మోడ్లో ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. వాటిని విస్మరించి వీటిని తప్పని చెప్పడం ఏమిటని జగన్ను నిలదీశారు. గతంలో మీరు నడిపిన ఆరోగ్యశ్రీ, క్యాథలాబ్లను కూడా పిపిపి అంటారా? అని సందేహం వ్యక్తం చేశారు.

