సమానత్వం, చైతన్యం, మానవతా విలువల పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-జేసి మొగిలి వెంకటేశ్వర్లు
సామాజిక చైతన్యానికి, వాడుక భాషకు గురజాడ రచనలు ప్రతీక..
నెల్లూరు: గురజాడ సాహిత్యాన్ని, సామాజిక దృక్పథాన్ని స్మరించుకుంటూ, సమాజంలో సమానత్వం, చైతన్యం, మానవతా విలువల పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసి మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో డిఆర్వో విజయ కుమార్ తో కలసి గురజాడ అప్పారావు చిత్రపటానికి జేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా ఎస్.రాయవరం ప్రాంతంలో జన్మించిన గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించారన్నారు. సామాజిక దురాచారాలను ప్రశ్నిస్తూ, ప్రజల్లో చైతన్యం కలిగించేలా రచనలు చేసిన మహాకవి గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేస్తూ తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడికి గురజాడ బాటలు వేశారని పేర్కొన్నారు. వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాష వ్యాప్తికి కృషి చేశారని తెలిపారు. గురజాడ రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని జేసి పేర్కొన్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలను ప్రశ్నిస్తూ సామాజిక సంస్కరణకు దోహదపడేలా ఈ నాటకాన్ని రచించారని తెలిపారు. గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు వంటి పాత్రలు తెలుగు సాహిత్య, నాటక రంగంలో చిరస్మరణీయంగా నిలిచాయని అన్నారు. ‘దేశమును ప్రేమించుమన్నా’ వంటి దేశభక్తి గీతాలతో ప్రజల్లో దేశాభిమానం, సామాజిక బాధ్యతను పెంపొందించే సందేశాన్ని అందించారన్నారు. ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ వంటి రచనల ద్వారా కూడా సామాజిక దురాచారాలపై తనదైన శైలిలో స్పందించారని తెలిపారు.
సాహిత్యాన్ని కేవలం వినోదానికి పరిమితం చేయకుండా సమాజంలోని సమస్యలను ప్రతిబింబించే సాధనంగా గురజాడ వినియోగించారని తెలిపారు. హేతుబద్ధమైన ఆలోచన, సామాజిక చైతన్యం, మానవతా దృక్పథం వంటి విలువలను ఆయన రచనలు నేటి తరానికి కూడా అందిస్తున్నాయని పేర్కొన్నారు. గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆయన సాహిత్యాన్ని, సామాజిక దృక్పథాన్ని స్మరించుకుంటూ, సమాజంలో సమానత్వం, చైతన్యం, మానవతా విలువల పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెట్నెల్ సి ఈ ఓ నాగేశ్వర రావు, టూరిజం ఆఫీసర్, ఎస్ కె అలీ, మెప్మా పీడి కిరణ్ కుమార్, మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ పినాక పాణి, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

