AP&TG

ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో స్వర్ణం సాధించిన ధీరజ్ కు అభినందనలు-పవన్ కల్యాణ్

అమరావతి: మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. అద్భుతమైన సంయమనం, కచ్చితత్వం, పట్టుదలతో, ధీరజ్ ఉత్కంఠభరితమైన షూట్-ఆఫ్‌లో జపాన్‌కు చెందిన జున్యా నకానిషిని ఓడించి, పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారని ప్రశంసించారు. తద్వారా ప్రపంచ కప్ ఫైనల్‌లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారతీయ పురుష రికర్వ్ ఆర్చర్‌గా నిలిచారని పేర్కొన్నారు. అతని ప్రయాణం, అంకితభావం ప్రత్యేకంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
విజయవాడకు చెందిన ధీరజ్, చిన్న వయసులోనే తన ఆర్చరీ ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ప్రత్యేకంగా ఎగురవేస్తూ ఈ క్రీడలో శిఖరాగ్రానికి చేరుకున్నారని అభివర్ణించారు. ఇది భారత ఆర్చరీ చరిత్రలో ఒక మైలురాయని.. మన క్రీడాకారుల ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనమని ఉద్ఘాటించారు. బొమ్మదేవర భారత్‌కు గర్వకారణంగా నిలిచారని తెలిపారు భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

డీపీ వరల్డ్ ఉమెన్స్ ఆసియా కప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్టు పెట్టారు. నైపుణ్యం, సంయమనం, పట్టుదలకు ఇది ఒక చక్కటి ప్రదర్శన అని వ్యాఖ్యానించారు. ఈ విజయం భారత క్రికెట్‌కు మరో గర్వకారణమని పేర్కొన్నారు. భారత మహిళలకు ఓ అద్భుతమైన ఘనత అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *