ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జోర్డాన్ లో ఘనస్వాగతం
మూడు రోజుల విదేశీ పర్యటనలు..
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో బాగంగా సోమవారం జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు చేరుకున్నారు.డిసెంబర్ 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటన ద్వారా ఆయా దేశాలతో పురాతన సంస్కృతిక సంబంధాలతో పాటు ఆధునిక ద్వైపాక్షిక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాలన్నది ప్రధాని పర్యటన ప్రధాన లక్ష్యం. ప్రధాని మోదీ,,జోర్డాన్ సందర్శన భారత్-జోర్డాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతోంది.2018లో జోర్డాన్ పర్యటించిన ప్రధాని మోదీ,ఏడు సంవత్సరాల తరువాత మళ్లీ జోర్డాన్ కు వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్,, దేశ ప్రధాని జాఫర్ హసన్‌లతో సమావేశం అవుతారు. జోర్డాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటిస్తారు. భారతీయ సంతతి భారత్-జోర్డాన్ సంబంధాలకు గణనీయమైన కృషి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధాని మోదీకి జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో భారతీయ సంతతి నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని మోదీని హోటల్ వద్ద జోర్డాన్ లోని భారత సంతతికి చెందిన వారు భారత జాతీయ జెండాను చేతబట్టి ప్రధాని మోదీకి నమస్కరించి స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని వారిని ప్రేమతో పలుకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

