మేయర్ స్రవంతి రాజీనామాను ఏకగ్రీవంగా అమోదించిన నగరపాలక సంస్థ కౌన్సిల్
ఇన్చార్జి మేయర్ గా రూప్ కుమార్..
నెల్లూరు: నగర పాలక సంస్థ కార్యాలయంలో గురువారం కౌన్సిల్ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఇన్చార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యులు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఇన్చార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ గా ఉన్న పొట్లూరు స్రవంతి ఈనెల 14వ తేదీన వ్యక్తిగత కారణాలవల్ల పదవికి రాజీనామా చేసి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వారికి తన ప్రతినిధుల ద్వారా అందజేశారని తెలిపారు. తదుపరి చేపట్టవలసిన చర్యలపై కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం జరుపుకునేందుకు ఏర్పాటు చేయాలని సూచిస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ కు జిల్లా కలెక్టర్ ఆదేశించారని వివరించారు. దింతో నేడు ఏర్పాటుచేసిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో పొట్లూరు స్రవంతి రాజీనామాను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించిందని రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఇంచార్జ్ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన రూప్ కుమార్ యాదవ్ ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, కో ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

