AP&TGDISTRICTS

ఉదయగిరిలో రెండు రక్షణ పరిశ్రమలు ఏర్పాటు- సీఎం చంద్రబాబునాయుడు

వింజమూరు పాతూరు చెరువుకు నీళ్లు..

నెల్లూరు: పాతూరు చెరువును బాగుచేసుకునేందుకు వింజమూరు ప్రజలు చూపిన చొరవను నేను ఎప్పుడూ మరచిపోనని, 30ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో తాను చేపట్టిన జన్మభూమి స్ఫూర్తిని వింజమూరు ప్రజలు మళ్లీ గుర్తుచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా వింజమూరు ప్రజలను అభినందించారు. బుధవారం వింజమూరులో పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం మార్గమధ్యలో పాతూరు చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజావేదిక సభలో సీఎం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ “70 లక్షలు ఖర్చుపెట్టి రాత్రింబవళ్లు ప్రొక్లెయినర్స్, ట్రాక్టర్లు పెట్టి పాతూరు చెరువును అభివద్ధి చేశారు. బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చెరువును, చెరువు కట్టను అందంగా తయారుచేశారు. మీరు ఒక అడుగు వేస్తే…నేను వంద అడుగులు వేస్తాను” అని సీఎం చంద్రబాబు వింజమూరు ప్రజల స్ఫూర్తిని అభినందించారు. ప్రజల పనితీరును గమనించిన సీఎం, వెంటనే సోమశిల కాలువ నుంచి పాతూరు చెరువుకు నీటిని తీసుకొచ్చేందుకు రూ.34 కోట్లు మంజూరు చేశారు. ఆరునెలల్లో పనులు పూర్తి చేసి ఈ ఏడాది అక్టోబర్ లోపు పాతూరు చెరువును సోమశిల నీటితో నింపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నీటి వలన ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. తాగునీరు, సాగునీరు పుష్కలంగా లభిస్తాయన్నారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరులో ప్రీమియర్ ఎక్స్‌ ప్లోజివ్స్, ఉదయగిరిలో అనడ్రోన్ సిస్టమ్స్ అనే రెండు రక్షణ రంగ పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. వీటితో ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. ఒకప్పుడు ఉదయగిరి అంటే వలసలు వెళ్లే ప్రాంతమని, ఇప్పుడు  పరిశ్రమలకు గమ్యస్థానంగా ఉదయగిరిని తీర్చిదిద్దుతామని, బయట ప్రాంతాల్లో ఉన్న ఉదయగిరి వాసులందరూ తిరిగి ఉదయగిరిలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకురావాలని సీఎం పిలుపునిచ్చారు. అలాగే ఉదయగిరి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.

చేనేతలకు ఉచిత విద్యుత్:-మగ్గం ఆడితేనే ఇంట్లో దీపం వెలిగే నేతన్నల కష్టాన్ని అర్థం చేసుకుని ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టాం అని సీ.ఎం అన్నారు. 93 వేల చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఈరోజు నుంచే అమల్లోకి వస్తోంది. విద్యుత్‌ను రాయితీగానే కాదు…ఒక్కో నేతన్న కష్టానికి ఇస్తున్న గౌరవం… వారి వృత్తికి కలిగిస్తున్న భరోసా వస్తుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *