రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయకుండా విద్యుత్ నిర్మాణ పనులు-మంత్రులు
అమరావతి: రాజధాని ప్రాంతంలో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో సీఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా విద్యుత్ నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించారు. ముఖ్యంగా హైటెన్షన్ లైన్ల మార్పిడిపై ఇరు శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి సమయానికి పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సమావేశంలో చర్చించారు. రాజధాని అభివృద్ధిలో విద్యుత్ మౌలిక వసతులు కీలకమని, వాటి నిర్మాణం నాణ్యతతో పాటు సమయపాలనతో పూర్తి కావాలని మంత్రులు తెలిపారు. ఈ సమావేశానికి సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డిలతో పాటు ఇరు శాఖలకు సంబంధించిన ఇతర అధికారులు హాజరయ్యారు. రాజధాని పరిధిలో చేపట్టిన విద్యుత్ శాఖ పనుల పురోగతిపై ఇరువురు మంత్రులు సమగ్రంగా చర్చించారు.

