AP&TG

30 వేల మంది తీర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తాగునీటి.పవన్ కళ్యాణ్

30 ఏళ్ల తాగునీటి కష్టాలకు తెర..

అమరావతి: ‘ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడంతో పాటు భవిష్యత్తుపై నమ్మకం కలిగించాల’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా రూ.17.33 కోట్లతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఒ.ఎన్.జి.సి. నిధులు రూ.5 కోట్లతో 6 మిలియన్ లీటర్ల సామర్ధ్యం కలిగిన ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 

30 వేల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. జల్ జీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ.17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ ప్రాజెక్టు 30 వేల మంది తీర ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తుంది. దీని కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి, దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్ధ్యం కలిగిన రాపిడ్ సాండ్ ఫిల్టర్ ప్లాంటు, వాటర్ ట్యాంక్ నిర్మించాం.

30 ఏళ్ల తాగునీటి కష్టాలకు తెర:- ఈ ప్రాజెక్టుని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశాం. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకువచ్చి చెరువులో స్టోరేజీ చేయనున్నాం. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేదిపాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ఈ ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండడంతో ప్రజల అవసరాలకు సరిపడ తాగు నీరు అందేది కాదు.30 ఏళ్లుగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ప్రారంభించిన అంతర్వేది సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *