దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
నెల్లూరు: దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు దేశ సముద్ర సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో కీలకమైన ముందడుగు పడింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ డెవలప్ మెంట్ సెంటర్ ను అభివృద్ధి చేయనుంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్న మంత్రి లోకేష్,సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ప్రాజెక్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టమ్స్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు సాగర్ డిఫెన్స్ సంస్థ మొదటి దశలో రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా వెయ్యి మందికి పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం జువ్వలదిన్నె పిషింగ్ హార్బర్ వద్ద మొదటి దశ కింద 29.58 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఇందులో 7.58 ఎకరాల వాటర్ ఫ్రంట్ ల్యాండ్ కూడా ఉంది. 2026 నవంబర్ నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 200 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. షిప్ బిల్డింగ్, అటానమస్ సిస్టమ్స్ డెవలప్ మెంట్, మెరైన్ ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ బ్లూ ఎకానమీ, మారిటైం ఇన్నోవేషన్ ను బలోపేతం చేయడంతో పాటు ఏపీని మారిటైం రోబోటిక్స్, అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్ గా నిలపనుంది.

