టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల కోసం రూ.4,450 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ-చంద్రబాబు
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయడం, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పేదలకు గృహ నిర్మాణం వంటి అంశాలపై కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సమావేశం అనంతరం సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు.
పోలవరం పూర్తికి అదనపు నిధులు:– వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. డ్యామ్ నిర్మాణానికి అవసరమైన రాయిని సేకరించేందుకు రూ.247 కోట్లు, లెఫ్ట్ సైడ్ కనెక్టివిటీలో నావిగేషన్ టన్నెల్ నిర్మాణం కోసం రూ.4.49 కోట్ల అదనపు బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు.
గృహ నిర్మాణం, అమరావతిపై కీలక నిర్ణయాలు:– ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతుల కోసం హడ్కో నుంచి రూ.4,450 కోట్ల రుణం పొందేందుకు ఏపీ టిడ్కోకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీని కేబినెట్ రాటిఫై చేసింది. కొత్తగా ఇళ్ల కోసం వచ్చిన 10 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, 2029 నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యమని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహం:– విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఏఐజీ (ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆసుపత్రి ఏర్పాటుకు ఎండాడలో 9.04 ఎకరాల భూమిని కేటాయించారు.ఎకరాకు రూ.5 కోట్ల చొప్పున ఈ భూమిని కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల కోసం అవసరమైన నేపియర్ గ్రాస్ పెంపకానికి భూములను కేటాయించారు. ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో సుమారు 1544 ఎకరాలను ఎకరాకు రూ.15,000 వార్షిక లీజు ప్రాతిపదికన కేటాయించారు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టుల వద్ద ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి అవసరమైన భూములను ఏపీ మారిటైమ్ బోర్డుకు బదలాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మెగా టెక్స్‌టైల్ పార్క్ కోసం ఏపీఐఐసీకి 77.33 ఎకరాలను ఎకరాకు రూ.7.5 లక్షల చొప్పున కేటాయించారు. దీంతోపాటు రాష్ట్రంలో మెగా సోలార్ ప్లాంట్ల నిర్మాణం కోసం అనంతపురం, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో వేల ఎకరాల భూమిని లీజుకు ఇచ్చేందుకు కూడా మంత్రిమండలి అంగీకరించింది.
అథ్లెట్ జ్యోతి యర్రాజీకి అండగా ప్రభుత్వం:– అంతర్జాతీయ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత కుమారి యర్రాజి జ్యోతి ప్రతిభను గుర్తిస్తూ ఆమెకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, విశాఖపట్నంలో 500 గజాల నివాస స్థలం కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. పేదరికం నుంచి వచ్చి దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న జ్యోతికి ఇప్పటికే ప్రభుత్వం రూ.76.25 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందించిందని, భవిష్యత్తులో శిక్షణ కోసం కూడా ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
తిరుపతి లడ్డూ వివాదంపై చర్చ:– తిరుపతి లడ్డూ ప్రసాదం నాణ్యతపై వచ్చిన ఆరోపణల గురించి కేబినెట్‌లో చర్చ జరిగిందని మంత్రి తెలిపారు. లడ్డూలో కల్తీ జరిగిందన్నది వాస్తవమేనని, అయితే ఏ పదార్థాలు కలిపారనే దానిపై పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

