Recent Posts

ప్రతి ధాన్యపు గింజనూ కొంటాం-వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. రైతులు తప్పనిసరిగా తమ పేరును ‘ఈ పంట’లో నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి అధిక ప్రాధాన్యతిస్తూ, ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ లో భాగంగా రూ.1190.11 కోట్లతో లక్షన్నర హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ విస్తరింపజేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.  వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాలులో పంటల కొనుగోలుపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ధాన్యపు గింజనూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల కొనుగోలు చేయనున్నామన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న ఆర్బీకేల ద్వారా ‘ఈ పంట’ లోని Paddy Procurement Online పోర్టల్ లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకోవడం వల్ల ఇతర రాష్ట్రాల రైతులు ఏపీలో తమ పంటలను విక్రయించుకునే అవకాశం ఉండదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా రైతుల పొలాల వద్దకెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.దీనివల్ల దళారులు/మధ్యవ్యర్తుల ప్రమేయం ఉండదన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తరవాత 21 రోజుల్లో రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. దీనివల్ల రైతులకు కనీస మద్దతు ధర లభిస్తోందన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11.90 లక్షల మంది రైతులు 13.43 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు 2021-21 సంవత్సరానికి సంబంధించి మరో లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.1190.11 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేసే రైతులకు 90 శాతం సబ్సిడీ అందజేయనున్నామన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో 4 హెక్టార్లు కలిగిన రైతులకు 70 శాతం,5 హెక్టార్లు కలిగిన ప్రకాశం జిల్లా మినహా మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల రైతులకు 50 శాతం మేర సబ్సిడీ అందజేయనున్నామన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. నగదు జమలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే తనకు దృష్టికి తీసుకురావలని, తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో మంత్రులు,ఎమ్మేల్యే,అథికారులు తదతరులు పాల్గొన్నారు. 

Spread the love