Recent Posts

జూలై చివరి నాటికి కోటి పని దినాల లక్ష్యం పూర్తి చేయాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో ఈనెలాఖరుకు ఒక కోటి పని దినాల లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.బుధవారం క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెలాఖరు నాటికి ఒక కోటి పని దినాలు కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 80 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందన్నారు. మిగిలిన 20 లక్షల పనిదినాలను కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  ఇందుకోసం ప్రతి గ్రామంలో ఉపాధి పనులు తప్పనిసరిగా జరగాలన్నారు. ఇందులో శ్రమశక్తి సంఘాలను,  సర్పంచులను కూడా భాగస్వాములు చేసి పెద్దఎత్తున కూలి పనులు జరిగేలా చూడాలన్నారు. క్షేత్ర స్థాయి నుండి పై అధికారి వరకు ప్రతి ఒక్కరికి  లక్ష్యాలను నిర్ధారించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. ప్రభుత్వ భవనాలు, రహదారుల నిర్మాణ పనుల్లో కూడా ఉపాధి పనులు కల్పించాలన్నారు. వెంకటాచలం, టిపి గూడూరు, పొదలకూరు, ముత్తుకూరు తదితర మండలాల్లో మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువగా వాడారని కూలీలకు ఉపాధి పనులు ముఖ్యంగా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి ఉపాధి కార్డు కలిగిన కుటుంబానికి తప్పనిసరిగా నూరు రోజుల పనిదినాలు కల్పించాల్సి ఉందన్నారు. జగనన్న కాలనీల నిర్మాణంలో కూడా 90 రోజుల పనిదినాలను కూలీలకు కల్పించాలన్నారు. ఒక ప్రత్యేక డ్రైవ్ పెట్టి ద్వారా కొత్తగా ఉపాధి కార్డులు అవసరమైనవారికి ఇవ్వాలని,  కొత్తగా పెళ్లయిన వారికి కార్డులు ఇవ్వడంతోపాటు వారికి కూడా పనులు కల్పించాలని స్పష్టం చేశారు.

Spread the love