Recent Posts

శబరిమల మండల-మకరవిళక్కురోజుకు 25,000 మంది వరకు భక్తులను అనుమతి-సీ.ఎం

అమరావతి: మండల-మకరవిళక్కు సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ప్రారంభంలో రోజుకు 25 వేల మందిని అనుమతిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబరు 16 నుంచి ప్రారంభమయ్యే యాత్రకు చేయవలసిన ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.భక్తుల సంఖ్యను సవరించవలసి వస్తే, చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మండల-మకరవిళక్కు నవంబరు 16 నుంచి ప్రారంభమవుతుంది. శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు..ఈ యాత్రకు రోజుకు 25,000 మంది వరకు భక్తులను అనుమతిస్తామని పినరయి విజయన్ చెప్పారు. వర్చువల్ క్యూ సిస్టమ్ కొనసాగుతుందన్నారు. పదేళ్ళ లోపు, 65 ఏళ్లు పైబడిన వయసుగలవారిని కూడా శబరిమల దేవాలయంలోకి అనుమతిస్తామని, అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాలని, లేదా, నెగెటివ్ ఆర్‌టీపీసీఆర్ రిపోర్టు తీసుకురావాలని చెప్పారు. అందరికీ నెయ్యాభిషేకానికి దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయ్యప్పను దర్శనం చేసుకున్న భక్తులను సన్నిధానం వద్ద ఉండటానికి అనుమతించరాదని నిర్ణయించామన్నారు. ఎరుమేలి గుండా అటవీ మార్గంలో కానీ, పులిమేడు గుండా సన్నిధానానికి సంప్రదాయ మార్గంలో కానీ భక్తులను అనుమతించబోమని చెప్పారు.

Spread the love