తిరుపతి: ఈ నెల 27 నుంచి మే 5 వరకు పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో కోవిడ్ నిబంధనలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. మంగళవారం నగరపాలసంస్థ కార్యాలయంలో కలెక్టర్ మీడియాకు వివరిస్తూ కోవిడ్ నేపథ్యంలో రెండు సంవత్సరాల తరువాత పది పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలు మండల పోలీస్ స్ట్రేషన్ లలో భద్రపరిచామని తెలిపారు. తిరుపతి జిల్లాకు సంబంధించి 10వ తరగతి రెగ్యులర్ మరియు ప్రైవేటు విద్యార్థులు 180 పరీక్షా కేంద్రాల్లో 27,584 మంది పరీక్షలు వ్రాయనున్నారని తెలిపారు.అలాగే ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం నిర్వహించే ఓపెన్ స్కూల్ 10 పరీక్షలకు 9 కేంద్రాలలో 1585 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని వివరించారు.
పది పరీక్షల హాల్ టికెట్ తో బస్సులో ప్రయాణానికి అనుమతి- జిల్లా కలెక్టర్
