మణిపూర్‌లో మైతేయి నాయకుల అరెస్టుతో ఉద్రిక్తత
అమరావతి: మణిపూర్‌లో మైతేయి సంస్థ నాయకుడైన అరంబాయి టెంగోల్ అరెస్టుపై హింసాత్మక నిరసనలు చెలరేగిన ఒక రోజు తర్వాత, ఆదివారం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో పరిపాలన పరమైన నిషేధాజ్ఞలు విధించి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిందని పోలీసులు తెలిపారు..జాతుల వైరంతో కొద్దికాలంగా అట్టుడుకుతూ వచ్చిన మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.. అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఇంఫాల్‌లోని కావాకేథేల్, యురిపోక్‌లో రోడ్లపైకి వచ్చారు, టైర్లు, పాత సామగ్రికి నిప్పుపెట్టారు..దీంతో ప్రదర్శకులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.. కావాకేథేల్ ఔట్‌పోస్టుపై నిరసనకారులు దాడికి దిగారు.. ఈ ఘర్షణల్లో ఇద్దరు జర్నలిస్టులు, ఒక పౌరుడు గాయపడ్డారు.. ఆరాంబాయ్ టెంగోల్ అనేది మణిపూర్ ప్రాంతంలో చురుకుగా ఉన్న మైతేయి యూత్ గ్రూప్. జాతుల ఘర్షణ సమయంలో కమ్యూనిటీ మొబిలైజేషన్‌లో కీలక భూమిక పోషించినట్టు చెబుతుంటారు. ఇటీవల చోటుచేసుకున్న అలజడుల్లో వీరి ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడం, వీరిలో కొందరిని అరెస్టు చేయడం తాజా ఉద్రిక్తతలకు కారణమవుతోంది.