పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో మిలటరీ జరిపిన కాల్పులో 150 మంది మృతి
అమరావతి: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లోని రావల్కోట్‌లో స్థానికులు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(JAAC) మద్దతుదారులపై పాకిస్థాన్ మిలటరీ కాల్పులు జరపడంతో 150 మందికి పైగా మృతిచెందగా,దాదాపు 200 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ జరుగుతున్న నిరసనలు కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. నిరసనలు చేపడుతున్న జేఏఏసీ సంస్థను పాకిస్థాన్ ప్రభుత్వం గత వారం నిషేధించడంతో భారీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆదివారం రావల్‌కోట్‌లో నిరసనకారులు, భద్రతా దళాలు మధ్య జరిగిన ఘర్షణల్లో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
జేఏఏసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధించడంతో శుక్రవారం రాత్రి ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో భద్రతా దళాల కాల్పుల్లో ఓ వ్యాపారి మరణించారంటూ ఆరోపణలు రావడంతో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఆదివారం వ్యాపారి మృతదేహాన్ని ఉంచిన ఆస్పత్రి మార్చురీ బయట జేఏఏసీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడారని రావల్‌కోట్ కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
నిరుద్యోగం, సహజ వనరుల దోపిడీ:- అధికారుల కథనాన్ని జేఏఏసీ మద్దతుదారులు ఖండించారు. ఇంటర్నెట్ నిలిపివేతలు, విద్యుత్ కొరత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సహజ వనరుల దోపిడీ, రాజకీయంగా పక్కన పెట్టడం వంటి అంశాలపై కొన్ని నెలలుగా జేఏఏసీ ఆందోళనలు చేస్తోంది. పలు ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రజా సంక్షేమం దృష్ట్యా జేఏఏసీని స్థానిక ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

