Recent Posts

కలెక్టర్ చొరవతో పరీక్షలు వ్రాసిన ఇంటర్ విద్యార్దులు

నెల్లూరు: అసని తుఫాను కారణంగా వాగులు ఉప్పొంగడంతో పరీక్ష కేంద్రం చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఇంటర్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రత్యేక చొరవతో సజావుగా పరీక్షలు రాశారు.వివరాల్లోకి వెళితే….. కలిగిరి మండలం సిద్ధన కొండూరు గ్రామానికి చెందిన 8 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు కావలి పరీక్షా కేంద్రంలో  పరీక్షలు వ్రాసేందుకు బయల్దేరారు..మార్గ మధ్యలో పలు చిన్న వాగులు దాటుకుంటూ ఉధృతంగా ప్రవహిస్తున్న పరికోట వాగు దాటలేక చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ చక్రధర బాబు వెంటనే స్పందించి ఎలాగైనా సరే వారు వాగు దాటి పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కలిగిరి తహసిల్దార్ కృష్ణ ప్రసాద్ ను ఆదేశించారు. అంతేకాకుండా సమయాభావం వల్ల వారు కావలికి చేరుకోలేని పరిస్థితి ఉండటంతో కలెక్టర్ ఇంటర్మీడియట్ శాఖ కార్యదర్శి ఎంవి శేషగిరిబాబుకు ఈ విషయం తెలియజేసి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిని కోరగా అందుకు వారు సమ్మతించారు. వెంటనే  కలెక్టర్ ప్రాంతీయ తనిఖీ అధికారి ప్రసాద్ రావు తో మాట్లాడి కలిగిరి ఆదర్శ పాఠశాలలో ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు  రాసేందుకు వీలు కల్పించాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కలిగిరి తహసీల్దార్ గ్రామస్థుల సహాయంతో పరికోట వాగులో మానవహారం ఏర్పాటు చేయించి ఇంటర్ విద్యార్థులను వాగు దాటించారు.అక్కడి నుండి తహసీల్దార్ తన కారుతో పాటు బాడుగ ఆటోలలో ఆ విద్యార్థులను కలిగిరి ఆదర్శ పాఠశాలకు సురక్షితంగా చేర్పించారు. ఈలోగా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న విద్యాశాఖ అధికారులు ఆ విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించారు. అప్పటివరకు ఆందోళనతో ఉన్న విద్యార్థులు సంతోషంగా పరీక్షలు రాయగలిగారు.ఈ సందర్భంగా విద్యార్థులు తాము పరీక్షలు రాసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించినందుకు జిల్లా కలెక్టర్ కి  ధన్యవాదాలు తెలిపారు.

Spread the love
error: Content is protected !!