Recent Posts

 జీవో నెం.77, 55 ను రద్దు చేయకపోతే త్వరలో కలెక్టరేట్ ముట్టడిస్తాం-ఏబీవీపీ

నెల్లూరు: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అలాగే జీవో నెంబర్ 77 ను రద్దు చేసి ప్రైవేట్  కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, జీవో నెం. 55 ను రద్దు చేసి డిగ్రీ చదువుతున్న విద్యార్ధులకు 100 శాతం విద్యా దీవెనను విడుదల చేయాలని, నెల్లూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు బుధవారం నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శంకర్ రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు నేను అధికారంలోకి వస్తే విద్యార్థులకు పెద్ద పీట వేస్తామని నాడు ఎన్నో హామీలు ఇచ్చి నేడు అధికారం చేపట్టాక విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు..ఆర్దం లేని జీవోలను తీసుకొస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకొని ఎయిడెడ్ విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి జీవో నెంబర్ 42 రద్దు చేసి ఎయిడెడ్ విద్యాసంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా నెల్లూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని,పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కలెక్టరేట్ ముట్టడిస్తామని,జిల్లాలో ప్రజా ప్రతినిధులను కూడా తిరగనివ్వమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాజశేఖర్, నగర కార్యదర్శి సాయికృష్ణ , నాయకులు ఉదయ్, యశ్వంత్, మనోహర్, లక్ష్మణ్ ,శివ, జయంత్, బాలాజీ, శ్రీను, నాని తదితరులు పాల్గొన్నారు.

Spread the love
error: Content is protected !!