నెల్లూరు: దేశంలోనే మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని వారి క్యాంపు కార్యాలయం నుండి వివిధ ప్రభుత్వ పథకాలు మంజూరుకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్కరు పథకాల లబ్దికి దూరం కాకూడదన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.అనంతరం కలెక్టర్ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తో కలిసి పలువురు లబ్ధిదారులకు డి ఆర్ డి ఎ ద్వారా మెగా బ్యాంకు చెక్కులు, ఇంటి పట్టాలు,నేతన్న నేస్తం మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు రావడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరవేయడానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతో పారదర్శకమైన ఒరవడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అర్హులైన లబ్ధిదారులు పథకాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాక వెంటనే ఆమోదించి లబ్ధి చేకూర్చే ఆస్కారం కలిగిందన్నారు.ఇంకా ఎవరైనా లబ్ధిదారులు అర్హత ఉండి కూడా ప్రయోజనాలు పొందకుంటే దగ్గరలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయల్లో, స్పందన కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకుంటే వారందరికీ కూడా ఆరు నెలల్లోగా పథకాలు మంజూరు చేస్తామన్నారు. ప్రజలు ఇచ్చే అర్జీలను 30 రోజుల లోగా పరిష్కరిస్తామన్నారు. ఇటువంటి కార్యక్రమం ప్రవేశపెట్టినందుకు జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.