వికసిత భారత్ లక్ష్యసాధన దిశగా కృషి-కలెక్టర్
నెల్లూరు: వికసిత భారత్ లక్ష్యసాధనలో భాగంగా స్వర్ణాంధ్ర రాష్ట్ర విజన్ ప్రణాళికలోని పది సూత్రాల అమలుకు అకుంఠిత దీక్షతో పని చేస్తామని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అత్యంత వైభవంగా జరిగిన వేడుకల్లో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ వెంటరాగా జిల్లా కలెక్టర్ ఆనంద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా మువ్వన్నెల రంగుల బెలూన్లను, శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేశారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలనుద్దేశించి కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ ప్రణాళికలోని పది సూత్రాలైన పేదరిక నిర్మూలన, ఉపాధి, నిపుణులైన మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, ఇంధన ఆదా, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్నాలజీల లక్ష్య సాధన కు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా 15 వ ఫైనాన్స్ నిధులు 78.59 కోట్ల రూపాయలను గ్రామపంచాయతీలకు జమ చేసామన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 945 పాట్ హోల్స్ ను గుర్తించి 2.12 కోట్లతో పునరుద్ధరించామని, 6.20 కోట్లతో డివైడర్ల నిర్మాణం, సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే 19 కోట్ల రూపాయలు వ్యయంతో మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ వర్క్స్ కింద 770 కిలోమీటర్ల రోడ్డును పార్ట్ హోల్ ఫ్రీ చేస్తున్నామని ఇప్పటివరకు 280 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. అలాగే జల జీవన్ మిషన్ కింద 200 పనులను 57.82 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నామన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు:- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మొదటిగా పాడుదమా స్వేచ్చా గీతం, ఎగరేయుదమా జాతీయ పతాకం అంటూ కోవూరు జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థినులు దేశభక్తిని పెంపొందించేలా, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ చేసిన నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది.
విశిష్ట సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు పంపిణీ:- గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి, వివిధ రంగాల్లో ప్రతిభచూపిన కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు.