ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్చాంద్ర సాకారం-కలెక్టర్ ఆనంద్
నెల్లూరు: ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర, స్వచ్చాంద్ర సాకారమవుతాయని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు.శనివారం స్వచ్చాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు నగరంలోని వి ఆర్ సి సెంటర్ నుండి మద్రాస్ బస్టాండ్ మీదుగా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఎం.పీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ ముందుండి ర్యాలీ ప్రారంభించగా, మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు, వాకర్ అసోసియేషన్ సభ్యులు, వివిధ వర్గాల ప్రజలు భారీగా పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ ప్రజలందరి చేత స్వచ్ఛఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
కలెక్టర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 722 గ్రామ పంచాయతీలతో పాటు అన్ని మున్సిపల్ కేంద్రాల్లో స్వచ్చాంధ్ర, స్వచ్ఛత దివస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతినెల మూడో శనివారం ప్రత్యేకంగా జరిగే స్వచ్చాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. స్వచ్ఛత పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజుతో అయిపోయే కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ఉండాలన్నారు.
ఎం.పీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర ప్రమాణాన్ని ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిచ్చి పరిశుభ్రతను పాటించాలన్నారు. మన ఇంటి నుండి పరిశుభ్రతను ప్రారంభిస్తే, దానిని మన పిల్లలే ముందుకు తీసుకెళ్తారన్నారు. వచ్చే మార్చి 31 నాటికి జిల్లాలో ఏ ఒక్క మారుమూల గ్రామంలో కూడా బహిరంగ బహిర్భూమి లేకుండా చూడాలని, ఇది అందరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు.