7.77 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం-మంత్రి నారాయణ
నెల్లూరు: జిల్లాలో ఉన్న సాగునీటి కాలువలను బాగు చేయించి పూర్తిస్థాయిలో వినియోగం లోకి తీసుకువస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు.కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సాగునీటి సలహా బోర్డు సమావేశంలో మంత్రి నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాలువలకు మరమ్మత్తులు, డిసిల్టేషన్ చేయించాలని సమావేశంలో పలువురు రైతు నాయకులు కోరారని అన్నారు. రైతాంగం ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కాలువలు అన్ని బాగు చేస్తామని తెలిపారు..గత ఐదు సంవత్సరాలలో ఒక్క కాలువలో కూడా పూడిక తీయలేదని, బిల్లులు మాత్రం చేసుకున్నారని మంత్రి మండిపడ్డారు..కాలువలు మరమ్మత్తుల కోసం టెండర్లు ఈనెల 18 కి పూర్తవుతాయని,తరువాత పనులు చేపట్టడం జరుగుతుందన్నారు..
ఆక్రమణకు గురైన కాలువలు:- రైతు సంఘాల నాయకులు, అధికారులు కాలువల పనులు సక్రమంగా జరిగే విధంగా చూడాలన్నారు. రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని, ముఖ్యమంత్రి గారితో చర్చించి నిధులు తీసుకొస్తామన్నారు. ఆక్రమణకు గురైన కాలువలను ఆక్రమణ తొలగించి వెడల్పు చేస్తామన్నారు. ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఇరిగేషన్ మున్సిపల్ రెవిన్యూ అధికారులతో ఈ ఆపరేషన్ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆక్రమణ తొలగింపు పై స్పెషల్ డ్రైవ్ కూడా చేస్తామన్నారు.
7.77 లక్షల ఎకరాలకు సాగునీరు:- కావలి, ఉదయగిరి కాలువలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతాంగానికి నీరు అందే విధంగా చూస్తామన్నారు. ఒక్క చుక్క సాగునీరు వృధా కాకుండా రైతులు,అధికారులు ప్రత్యేక శ్రద్ధతో నీటిని వినియోగించుకోవాలన్నారు..ప్రస్తుతం సోమశిలలో 69 టీఎంసీలు, కండలేరులో 50 టీఎంసీలు నీరు అందుబాటులో ఉందని, సోమశిల ద్వారా 5.51 లక్షల ఎకరాలు, కండలేరు ద్వారా 2.26 లక్షల ఎకరాలు మొత్తం 7.77 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి పేర్కొన్నారు.