ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి-జిల్లా కలెక్టర్ ఆనంద్
ప్రజలకు క్లాత్ బ్యాగులు పంపిణీ..
నెల్లూరు: ప్రజలందరి సంపూర్ణ సహకారంతోనే స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం ఉదయం నెల్లూరు నగరంలోని తడికల బజార్ సెంటర్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ పాల్గొన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వలన కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను వాడుతున్నారని, ఇది ఆరోగ్యానికి, పర్యావరణానికి పెద్దప్రమాదంగా మారుతుందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో సుమారు 10వేల ఇంకుడు గుంతలు నిర్మించినట్లు చెప్పారు.
ప్లాస్టిక్ వాడకం,క్యాన్సర్‌కు కారణం-కమిషనర్:- ప్లాస్టిక్ వాడకం మన ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా అత్యంత హానికరమని, ప్లాస్టిక్ వినియోగం క్యాన్సర్‌కు కారణమని మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ అన్నారు. నగరంలోని 54 డివిజన్లలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ గ్లాసులు భూమిలో కరగవని, వీటిని కాల్చితే ఆ గాలి పీలిస్తే క్యాన్సర్ ప్రబలుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నయంగా బయోడిగ్రేడ్ కవర్లు, జూట్‌బ్యాగులు, క్లాత్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు సూచించారు.