నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు-కమిషనర్
నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 120 మైక్రోన్లకన్నా తక్కువ స్థాయి గల సింగల్ యూజ్ క్యారీ బ్యాగ్స్,, సింగల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉత్పత్తుల తయారీ, రవాణా, విక్రయం తదితరాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ సూర్య తేజ స్పష్టం చేశారు. సోమవారం అయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర- 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతినెల మూడవ శనివారం నాడు “స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు..నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీదారులు, రిటైలర్లు తగిన జాగ్రత్తలు తీసుకొని నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీని ఇక నుంచి కచ్చితంగా ఆపివేయాలని కమిషనర్ హెచ్చరించారు. క్రమం తప్పకుండా ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలకు భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు..అభివృద్ధిలో:- ఆస్తిపన్ను, తాగునీటి కొళాయి పన్ను, ఖాళీ స్థలం పన్ను బకాయిలు ఉన్నవారు ఈనెల చివరిలోపు పన్నులను పూర్తిగా చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ సూచించారు. నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాలు, పార్కుల ఏర్పాట్లు, రోడ్లు, డ్రైను కాలువల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, పన్నులను సకాలంలో చెల్లించి ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిషనర్ ఆకాంక్షించారు.