యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు-మంత్రి నారాయణ
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లలో డ్రైను కాలువల నిర్మాణం, భూగర్భ డ్రైనేజి పనులను పూర్తి చేసి వర్షపు నీరు నిల్వవుండకుండా చేసే ప్రణాళికతో పాటు, అన్ని పార్కులలో వ్యాయామ, క్రీడా పరికరాలను ఏర్పాటు చేసి పిల్లలందరూ వినియోగించుకునేలా యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయనున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ తెలిపారు. పబ్లిక్ హెల్త్, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ స్థానిక 2,3,4 డివిజన్ల పర్యటనలో పూర్తి కాని డ్రైను కాలువలను గుర్తించామని, నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో డ్రైను కాలువలను నిర్మించి భూగర్భ డ్రైను విధానానికి అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.