వేసవి నుంచి ఉపశమనం పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలి-జిల్లా కలెక్టర్ ఆనంద్
“బీట్ ద హీట్” ..
నెల్లూరు: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ మూడో శనివారం నిర్వహిస్తున్న బీట్ ద హీట్ కార్యక్రమంపై ప్రజలకు ముమ్మరంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఉదయం బీట్ ద హీట్ కార్యక్రమం నిర్వహణపై కలెక్టర్ ఆనంద్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నిశాఖల అధికారులు వేసవిలో ప్రజలకు ఉపశమనం కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని, ఎండ వేడిమి నుంచి సురక్షితంగా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నగరంలోని కార్పొరేషన్,మున్సిపాలిటీల పరిధిలో ఖాళీగా వున్న స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని, 6 నెలలపాటు సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. రైల్వేగేట్ల వద్ద షేడ్స్ ఏర్పాటుచేస్తున్నట్లు, నగర కమిషనర్ నందన్ కలెక్టర్‌కు తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని భవనాలపైన రూఫ్ టాప్ గార్డెన్ ఏర్పాటు చేసుకునేలా మెప్మా గ్రూపు సభ్యులకు అవగాహన కల్పించాలని మెప్మా పిడికి సూచించారు. చలివేంద్రాల ఏర్పాటు చేయాలని, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంటలు ఏర్పాటుచేయడం, మొక్కలు నాటడం వంటి ఉష్ణోగ్రతను తగ్గించే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అన్ని పంచాయతీలలో పక్షులు, పశువుల కోసం నీటితొట్టెలు, నీటి పాత్రల్లో నీళ్లు నింపి అందుబాటులో వుంచాలన్నారు.ఈ కార్యక్రమాల్లో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంధసంస్థలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.