ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ రక్షణలో ఎందరో సైనికులు అసువులు బాస్తున్నారు-మంత్రి ఆనం
నెల్లూరు: దేశ ప్రజల రక్షణలో ప్రాణ త్యాగం చేసిన పోలీస్ మహనీయులకు నివాళి అర్పిస్తూ, వారి కుటుంబాలకు అందరం తోడుగా ఉన్నామని తెలియజేసే మహాత్తరమైన రోజే పోలీసు అమరవీరుల దినోత్సవమని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత సంస్మరణ స్థూపం వద్ద విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి పోలీసు లాంఛనాలతో ఘన నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున చెక్కులు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ రక్షణలో ఎందరో సైనికులు అసువులు బాస్తున్నారన్నారు. అటువంటి వారి త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని సందేశాన్ని ఇచ్చేందుకు ఇటువంటి సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ 1959 వ సంవత్సరము అక్టోబరు 21 వ తేదీ జమ్మూ కాశ్మీర్ లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి ఐదు కిలోమీటర్ల ఎత్తున గల భారత దేశ సరిహద్దు అయిన లడాక్ భూ భాగంలోకి చైనా దురాక్రమణకు పాల్పడిన సమయంలో అసువులు బాసిన వీర జవాన్ల కు నివాళిగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నా మన్నారు. గత సంవత్సరం విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సిబ్బందికి తమ ప్రగాఢ నివాళి అర్పిస్తున్నామన్నారు.
జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల నుండి మన ఇంటి సరిహద్దుల వరకు అనునిత్యం కాపాడుతూ తమ ప్రాణాలను సైతం ఒడ్డి జవాన్లు,పోలీసులు పోరాడుతున్నారన్నారు. జిల్లాలో పోలీస్ సంక్షేమం పై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రతి శుక్రవారం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో గత సంవత్సరం ప్రాణాలోదిలిన 12 మంది పోలీసు వారికి నివాళి అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున పరిహారం అందించామన్నారు.