పదవ తరగతిలో ఫెయిల్ అయిన కసితో చదివి పీజిలో గోల్డ్ మెడల్ సాధించ-మంత్రి నారాయణ
నెల్లూరు: రాష్ట్ర చరిత్రలో ఒకే రోజున, ఒకే సమయంలో 45094 పాఠశాలల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించటం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం నెల్లూరు నవాబుపేటలోని BVS బాలికల ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 45094 పాఠశాలల్లో 1,85,000 మంది ఉపాధ్యాయులతో 72 లక్షల మంది తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయటం చరిత్రలో లిఖించ తగిన విషయమన్నారు. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమిష్టి ప్రోత్సాహంతోనే విద్యార్థుల శక్తియుక్తులు ద్విగిణీకృతమవుతాయన్నారు. దిగువ తరగతిలో సాధారణ స్థాయిలో ఉండి పదవ తరగతిలో ఉత్తమ ర్యాంకు సాధించిన వాళ్లు అనేకమంది ఉన్నారన్నారు. అందుకే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను దండించవద్దని, ఇటువంటి సమావేశాల్లో ఉపాధ్యాయులతో మాట్లాడి వారి బలహీనతలను తెలుసుకుని ప్రోత్సహించాలన్నారు. విద్యా భోదనలో 40 ఏళ్ల అనుభవాన్ని రాష్ట్రానికి అందిస్తానన్నారు. తాను పదవ తరగతిలో మొదట తప్పానని, తదుపరి గ్రేస్ మార్కులతో పాసయ్యానన్నారు. ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహంతో కసితో చదివి డిగ్రీ, పీజీ లలో గోల్డ్ మెడల్ సాధించానన్నారు. తక్కువ మార్కులు వచ్చాయని ఏ విద్యార్థి అధైర్య పడవద్దన్నారు. తరచుగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించటం ద్వారా విద్యార్థుల్లో గొప్ప మార్పు వస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను 11 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖధికారి బాలాజీ రావు , ప్రధాన ఉపాధ్యాయురాలు విజయజ్యోతి తదితరులు పాల్గొన్నారు.