జ్యోతిరావు పూలే ఆదర్శభావాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి-హర్యానా గవర్నర్
నెల్లూరు: మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శభావాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట పప్పుల వీధిలోని ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు నగరపాలక ఉన్నత పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడు పూలే అని అన్నారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని వెనుకబడిన వర్గాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు పూలే చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. తన సతీమణి సావిత్రిబాయికి విద్య నేర్పించి ఒక సామాజిక సంఘసంస్కర్తగా తీర్చిదిద్ది ఆమె ద్వారా మహిళల్లో విద్య పట్ల చైతన్యాన్ని కలిగించేందుకు పూలే సేవలు చిరస్మరణీయమన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసమే భారత ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యంతో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి దేశంలో మొట్టమొదటి విద్యా సంస్థను స్థాపించి మహిళా విద్యకు విశేషంగా కృషి చేశారని చెప్పారు. పూలే దంపతుల సేవలను స్మరించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కూడా మహిళలకు అన్ని విధాల అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందని చెప్పారు.