మార్చి 17 నుంచి 31 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు-డి.ఆర్.ఓ
నెల్లూరు: మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి జె. విజయభాస్కర్ రావు సంబంధిత అధికారులకు సోమవారం సూచించారు.వచ్చే నెల 17 నుంచి 31 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు నిర్వహించే ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 33,434 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి బాలాజీ రావు వివరించారు. అలాగే మొత్తం 1622 మంది ఇన్విజిలేటర్లు ను నియమించామన్నారు. పరీక్షల నిర్వహణ కు జిల్లాలో 174 కేంద్రాలను ఏర్పాటు చేసామని, వీటిలో 16 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు వివరించారు.డి ఆర్ ఓ మాట్లాడుతూ, ఆయా పరీక్షాకేంద్రాల వద్ద సరైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.అలాగే పరీక్షా కేంద్రాల వద్ద అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా కు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఒకేషనల్ విద్యా అధికారి మధుబాబు తో పాటు పోలీస్, ఆర్ టి సి, విద్యుత్, వైద్య శాఖల అధికారులు పాల్గొన్నారు.