భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి-జాయింట్ కలెక్టర్ కార్తీక్
నెల్లూరు: రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో ఇళ్లు నిర్మించుకున్న వారు క్రమబద్దీకరణ చేసు కోవడానికి ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. నిరభ్యంతరకర భూములలో 2019 అక్టోబర్ 10వ తేదీ కంటే ముందు భూమిని ఆక్రమించుకుని RCC స్లాబ్ తో కానీ, రేకులతోగాని ఇల్లు నిర్మించుకుని నివాసం ఉండేవారు రేగులరెైజ్ చేసుకోడానికి ఆధారాలతో దరఖాస్తు చేసు కోవాలని కోరారు.మీసేవ,గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ఈ ఏడాది డిసెంబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్రమబద్ధీకరణ పట్టాలను మహిళల పేరిట మాత్రమే జారీ చేస్తామనీ ,ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ళు నిర్మించు కున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని జెసి పేర్కొన్నారు.
150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని, రిజిస్ట్రేషన్ ఫీజు సైతం చెల్లించక్కర్లేదని తెలిపారు. దారిద్రరేఖకు దిగువను ఉండి 151 నుండి 300 గజాల లోపు అక్రమణలకు బేసిక్ ధరలో 15 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతం చెల్లించాలాన్నారు. దారిద్రరేఖకు ఎగువన ఉన్న వారు పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలను, 300 నుండి 450 గజాల పరిధిలో బిపిఎల్ కుటుంబాల వారు వందశాతం బేసిక్ ధర, 50 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలన్నారు. ఇదే విభాగంలో దారిద్రరేఖకు ఎగువన ఉన్న వారు 200శాతం బేసిక్ ధర, పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టవలసి ఉంటుందన్నారు. 450 గజాలకు మించిన అక్రమణలో ఎవరు ఉన్నప్పటికీ బేసిక్ ధరకు ఐదు రెట్లు, వందశాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి క్రమబద్దీకరించుకోవలసి ఉంటుందని తెలిపారు.
లే అవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్‌లో నిర్దేశిత స్థలాలు, జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ చేయబోరన్నారు. లబ్ధిదారులు, కుటుంబసభ్యులు ఐటీ చెల్లింపుదారై ఉండకూడదని, నాలుగు చక్రాలు వాహనం ఉండకూడదని కార్తీక్ స్పష్టం చేసారు. గరిష్ఠంగా గ్రామాల్లో నెలకు రూ. 10,000, పట్టణాల్లో నెలకు రూ.14,000 ఆదాయం ఉన్నవారు దీనికి అర్హులుగా నిర్ణయించగా, నెలకు రూ.300లోపు విద్యుత్తు ఛార్జీల చెల్లింపు ఉండాలన్నారు. మెట్ట, మాగాణి కింద కలిపి 10 ఎకరాలకు మించకూడదు. ఆర్‌సీసీ రూఫ్/ఆస్‌బెస్టాస్ రూఫ్‌తో ఇటుక గోడలతో నిర్మాణాన్ని పరిగణన లోకి తీసుకుంటామని జె సి వివరించారు. ఆస్తిపన్ను చెల్లింపు, విద్యుత్తు బిల్లు, వాటర్ బిల్లులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.